కదిలేదీ, కదిలించేదీ, మారేదీ, మార్పించేదీ, పాడేదీ, పాడించేదీ, మునుముందుకు సాగించేదీ, పెనునిద్దుర వదిలించేదీ, పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ, కావాలోయ్ నవకవనానికి! --- (శ్రీ శ్రీ - మహా ప్రస్థానం - నవకవిత నుండి) నవశకానికి కూడా సరిగ్గా సరిపోతుంది ఈ కవిత.
- నీవు కదలకపోతే ఏదీ కదలదనీ, నీవు మార్చకపోతే ఏదీ మార్చబడదనీ, నీవు నడవకపోతే నలుగురూ కలిసి లక్ష్యం వైపు సాగరనీ, నీవు నడిచి మాత్రమే నలుగురినీ నడిపించగలవనీ. మదనపడిన మనస్సు అంతరాల్లోనుండి ప్రకాశించినదే PGNF. ఆంధ్రుడి ఆత్మ ఎంత ఉన్నతమైనదో, జాతీయతా భావం అంటే ఎలా ఉండాలో చెప్తుంది నిస్వార్థమైన మన ప్రకాశం గారి చరిత్ర. ఆ ఆంధ్రకేసరి అడుగుజాడల్లో మనమంతా కదలాలంటూ మన నేల కోసం ఏదయినా చేయాలనే తపనతో చేయి చేయి కలిపి ముందు సాగుతున్న మన PGNF సంస్థ మన పాఠశాలల పట్ల, విద్యార్థుల పట్ల, మన భావితరాల పట్ల తన బాధ్యత ని అనేక గ్రంథాలయాల రూపంలో, విద్యార్థులకు అవసరమైన సైకిళ్ళ ని అందించటం తోనూ, పాఠశాలల్లో మంచి నీటి సదుపాయాలు, అనేక ఇతర సదుపాయాలను కల్పించి ముందడుగు వేస్తూనే వుంది. ఉంటుంది.
- అకస్మాత్తుగా, ఎవరూ ఊహించని విధంగా 2020 సం||లో ప్రపంచాన్ని అన్ని విధాలుగా కుదిపేసిన కరోనా వైరస్. ఈ వైరస్ బారిన పడకుండా గట్టిగా ఊపిరి పీల్చుకున్న దేశం ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. మన భారతదేశ ప్రభుత్వం ముందుగానే మేల్కొని మార్చ్ 22, 2020 నుండి ఏప్రిల్ 17,2020 వరకూ లాక్ డౌన్ విధించి COVID-19 వ్యాప్తి చాలా వరకు నిలువరించే ప్రయత్నం చేసి సఫలీకృతమైనది. తర్వాత మే 3, 2020 వరకు,ఆ తర్వాత మే 17, 2020 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ అవసరమైన చర్యలు చేపడుతూ వుంది. ఈ లాక్ డౌన్ వల్ల దేశం లో ఎక్కువ నలిగి ఆకలితో మిగిలేది ఎప్పుడు పేదవాడే అవ్వటం విచారకరం. రోజూ పని చేయకపోతే పూట గడవని జీవితాలెన్నో! ఎంతో మంది వలస కూలీలు కూడా పని చేసే అవకాశం లేక, పక్క రాష్ట్రాల్లో చిక్కుకుని అల్లాడే పరిస్థితి! వీరందరికీ ఆకలి తీర్చే ప్రయత్నం చేద్దామనే సత్సంకల్పం తో PGNF committe వేసిన అడుగుకి ప్రతీ అడుగు జత చేసిన ప్రతీ PGNF సభ్యులందరికీ, మిత్రులందరికీ కృతజ్ఞతలు.
- ఆకలితో అలమటించే ప్రతీ పేదవానికి కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో, లాక్ డౌన్ వల్ల మన రాష్ట్రం లో చిక్కుకుపోయిన వలస కూలీలకు సహాయపడదామనే ఆలోచనతో మొదలైన ప్రయత్నం సఫలీకృతమైనందుకు సంతోషిస్తున్నాం. మార్కాపూర్, చీరాల ప్రాంతాలలో 15000 మందికి ఆకలి తీర్చగలిగాం. 500 కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు మార్కాపూర్, మార్టూరు, చీమకుర్తి, ఒంగోలు పట్టణాలలో అందించగలిగాం. 12,000 Kgs (12 Tons) కూరగాయలు మార్టూరు, చీ మకుర్తి ప్రాంత రైతులకి మేలుచేసే విధంగా కొనుగోలు చేసి ఒంగోలు పట్టణంలో ఆపన్నులకు మే నెలలో 4 విడతలుగా పంచటం జరిగింది. 250 మాస్కులు కుట్టించి ప్రజలను కాపాడటం కోసం అహర్నిశలూ కష్టపడుతున్న డాక్టర్లకు, నర్సులకు పంచటం జరిగింది.
- COVID-19 ఆపన్నులకు సహాయం చేయటం లో PGNF సహాయాన్ని పొందిన వారు : PRABHUPADA ASHRAMAM (Jandrapet), EFFORT INDIA(Markapur), OBULREDDY HOSPITAL(Markapur)
- ఈ ప్రయత్నం లో సహకిరించిన PGNF వాలంటీర్స్ అందరికీ మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
- కరోనా వైరస్ నుండి కాపాడే వాక్సిన్ కోసం అహర్నిశలు పరిశోధిస్తున్న ప్రయత్నాలు గట్టెక్కి వైరస్ తో ఆలాడుతున్న ప్రపంచాన్ని ఒడ్డున పడేయాలని ఆశిద్దాం! అంతవరకూ సమాజం లో భౌతిక దూరం పాటిస్తూ మనల్ని, మన తోటివారిని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం! బయటికి వెళ్లేప్పుడు మాస్క్ ని తప్పక దరిద్దాం!
















































































