Friendship With Books Blog

పుస్తకంతో స్నేహం:

ప్రతి మనిషి జీవితంలో పుస్తకానికి ఒక ప్రముఖ స్థానం వుంది. ఇటీవల నేను చూసిన లేక చేసిన పనులలో నాకు ఎంతో తృప్తిని ఇచ్చిన కార్యక్రమం “పుస్తకాలతో స్నేహం”. ఆధునిక యుగంలో పుస్తకం ద్వారా నడత, సంస్కృతి, అవగాహన, భాష మీద పట్టు సంపాదించుకోవచ్చు అని నా అభిప్రాయం. అంతే కాకుండా ఒంటరిగా వుండే ఎంతో మందికి పుస్తకమే తోడు.

అన్వేషణ:

నిన్ను నువ్వు వెలిగించుకో అని చెప్పిన వివేకానందుడి గురించి మనం తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే. చదివే క్రమంలో తాత్వికత గురించి తెలుస్తుంది, మానవ సమాజం గురించి వ్యక్తుల అభిప్రాయములు, వారి స్థానిక స్థితిగతులు, కాలానుగుణంగా వచ్చిన మార్పులు మనం అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకి సింధ్ కాలం నాటి సంగతులు; హరప్పా మొహంజదారో పట్టణాల సంస్కృతి వారి కాలం నాటి  నాగరికత, అప్పటి ఆసియా ఉప ఖండ పరిస్థితి, సంగతులు మనకి తెలియాలి అంటే చరిత్ర లేదా నాగరికత మీద వున్న పుస్తకాలని చదవాల్సిందే. ఇంకా మరేదయినా చరిత్ర సంగతులు; ఉదాహరణకి గుండ్లకమ్మ నది గురించి తెలుసుకోవాలి అంటే ఆ నది గురించి మనం అన్వేషణ, శోధన సాగించాలసిందే. నది పుట్టుక, గమనం, భౌగోళిక నైసర్గిక స్వరూపం, కాల గమనంలో వచ్చిన మార్పులు మరియు ఎక్కడ సముద్రంలో కలుస్తుంది అనే వివరాలు కావాలంటే పుస్తకం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు.

అవగాహన, క్రమ శిక్షణ:

మనుషులు కొన్ని విషయాలని చూస్తే తెలుసుకుంటారు, మరికొన్ని విషయాలు పుస్తకాలలో చదివి అవగాహన తెచ్చుకుంటారు. ఉదాహరణకి సాంకేతిక రంగంలో జరిగే మార్పులు ఎప్పటికప్పుడు శోధించటం, పుస్తకాలలో లేక అంతర్జాలంలో చదవటం వలన మనకి అవగహన పెరుగుతుంది. మానవ చరిత్ర, సంస్కృతి గురించి చదవటం వలన మనకి ప్రాచీన మానవ నాగరికత నుంచి ఆధునిక మానవ సమాజం వరకు వచ్చిన మార్పులు, మంచి నడవడిక, క్రమ శిక్షణ అనే విషయాలు తెలుసుకోగలిగాం. చరిత్ర పరికించి చూసినా లేక మహానుభావుల జీవిత చరిత్రలు చదివినా వారి క్రమ శిక్షణ అలవాట్లు తర్వాతి తరం వారికి వారిచ్చిన సందేశం  తెలుస్తుంది.  ఇలా మానవ జీవితంలో పుస్తకం చాలా విషయాల మీద అవగాహన మరియు క్రమ శిక్షణ నేర్పుతుంది.

నడత, అలవాట్లు, కట్టుబాట్లు :

మనిషి వయస్సు పెరిగే కొద్దీ, కొన్ని విషయాలు, తత్త్వం, నడత పుస్తకం ద్వారానే నేర్చుకోగలుగుతారు. ఉదాహరణకి ఒక మానసిక వికలాంగుడి ప్రవర్తన తెలియాలి అంటే అవగాహనతో పాటు కొన్ని వారి అలవాట్లు వారి నడత గురించి తెలియాలి. అంటే మానసిక వికలాంగుడు ఏ విషయాలకి స్పందిస్తున్నారు అనేది వారి నడత మీద మనకి ఒక అవగాహన వస్తుంది. అలాగే ఒక ఖండపు భౌగోళిక, సామజిక పరిస్థితుల గురించి తెలియాలి అంటే అక్కడి ప్రజల జీవన విధానం, వారి కట్టుబాట్లు మరియు వారి ఆహారపు అలవాట్లు తెలుసుకోవాలి. ఇలా కొన్ని విషయాల మీద మనకి అవగాహన కలగాలి అంటే పుస్తకం తోడు వుండాలసిందే.

ఇంకా ఒంటరి మనుషులకి, జీవితంలో ఏదయినా ఇబ్బంది కలిగినప్పుడు అందరు విధిగా పుస్తకాన్ని తోడు ఉంచుకోవాలి. కొన్ని పుస్తకాలు మరీ ముఖ్యంగా సైన్సుకి సంబంధించిన విషయాలు తెలుసుకునే కొద్దీ జిజ్ఞాస ఇంకా ఎదో తెలుసుకోవాలనే  తపన పెరుగుతుంది. ఆధునిక మనిషి జీవితం, సైన్సు సాధించిన విజయాలు తెలుసుకునే కొద్దీ మనిషి నిత్యం నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అందుకే విజ్ఞానం అనేది తరగని సంపద అంటారు. ఇలా చెప్పుకుంటుంటే, ఒక మనిషి ఇబ్బందులలో ఉన్నప్పుడు లేదా ఆందోళనలో ఉన్నప్పుడు మంచి పుస్తకం స్వాంతనని ఇస్తుంది, హితుడిలా మంచి మార్గాన్ని చూపుతుంది. నేను ఎప్పుడయినా ఒంటరిని అనే భావన వచ్చినప్పుడు, నేను చదివిన తాత్వికం “ఏ మనిషి అయినా ఈ భూమి మీదకి ఒంటరిగా వస్తాడు, చివరి మజిలీలో ఒంటరిగానే పోతారు” అనేది గుర్తుకు వస్తుంది. లేదా ఇంకా ఏదయినా ఒక గొప్ప పని మొదలెట్టినప్పుడు గమ్యం చేరలేనేమో అని ఆందోళన కలిగినప్పుడు “1000 మైళ్ళ దూరం అయినా ఒక్క అడుగుతోనే ” అనే సూక్తి నాకు గుర్తు వస్తుంది. ఇలాంటి మంచి విషయాలు మనకి తెలియాలి అంటే పుస్తకాలని చదవాలి. మరియు ముఖ్యుల జీవిత చరిత్రలను దగ్గరగా చూడాలేమో.

ఇటీవలి కాలంలో మాధ్యమాలు రకరకాలు, ఉదాహరణకి ఎలెక్ట్రానిక్ మాధ్యమం, లేదా సోషల్ మీడియా ఇంకా ఎన్నెన్నో. ప్రతి మాధ్యమానికి ఒక గుర్తింపు, ప్రాముఖ్యత వున్నాయి, అయినను అచ్చు మాధ్యమం ఎప్పుడు ప్రత్యేకతే! అందుకేనేమో ఇప్పటికి గాంధీ గారి జీవిత చరిత్ర పుస్తకం చాలా విలువయింది. అందుకేనేమో మహానుభావులు వీరేశలింగం గారు అన్నారు – చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమని అబ్దుల్ కలాం గారు చెప్పారు.

నా బాల్యంలో చరిత్ర చుదువుతు స్ఫూర్తిని పొందేవాణ్ణి, మరీ ముఖ్యంగా స్వాతంత్ర సమరం అందులో పాల్గొన్న ముఖ్యులు, వారి నాయకత్వ లక్షణాలు నన్ను ప్రభావితం చేసాయి. నేను కాలేజి చదివే రోజుల్లో శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారి రచనల ద్వారా తెలుగు భాష మీద మక్కువ ఎక్కువయింది. తర్వాతి కాలంలో మనం తెలుసుకున్న విషయాలు ఆచరణలో పెట్టటం పది మందికి ఆదర్శంగా నిలవటం ముఖ్యమని గ్రహించా. అందుకు పుస్తక పఠనం, విషయ విశ్లేషణ చేయటం ప్రారంభించి నాకు తోచిన విధంగా పదిమందికి సాయ పడాలని అనుకుంటున్నా. చివరిగా నేను నమ్మే ఇంకో అంశం ఏంటంటే – “ప్రార్ధించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అని మదర్ థెరెసా గారు చెప్పారు. ఆ విషయం కూడా నేను ఒక పుస్తకంలోనే చదివాను. ఇలా న జీవితంలో పుస్తకం ఒక భాగం అయింది.

నేను గమనించిన మరికొన్ని విశేషాలు:

  • పుస్తకం హస్తభూషణం అన్నారు మన పెద్దలు.

  • భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం ఇంతవరకు రాలేదనడం అతిశయోక్తి కాదు.