COVID-19

కరోనా మహమ్మారి – మానవ సమాజం

వుహాన్ సిటీలో పుట్టిన వైరస్ మానవాళిని చిగురుటాకులా వణికిస్తుంది , ప్రత్యక్షంగా ప్రపంచం అంతా ఈ వైరస్ బాధితులే ! వైద్య రంగానికే ఛాలెంజ్ విసురుతున్న ఈ వైరస్ కి చివరికి వైద్యులు కూడా పీడితులే !!

కరోనా ప్రభావం :
ఎక్కడికక్కడ మానవ జీవనం స్తంభించి పోయిందని చెప్పాలి. ఈ వైరస్ తో ప్రపంచం అంతా ఆర్ధిక నష్టం, ఉద్యోగాలు తగ్గి పోవటం, రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో రోజువారీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు జాలి పడటం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. అయితే ఇంత దుఃఖ పరిస్థితిలో కూడా ఏమయినా మంచి తెలుసుకోగలిగామా అని ప్రశ్నించుకుంటే మానవ సంబంధాల గురించి చర్చించటం, ఇంటి సభ్యులందరు కొంత విశ్రాంతిగా తమ గురించి తాముతెలుసుకోవటం, జీవన గమనంలో వేగాన్ని తగ్గించుకుని తాత్వికంగా ఆలోచించటం, మనమే కాదు మన ప్రక్క కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం. బహుశా వినటానికి వింతగా వున్నా ఇది పచ్చి నిజం.

ఎవరు ఎవర్ని రక్షించాలి ?
కనిపించే దేవుడులాంటి డాక్టర్ ఎంతో ప్రయాసపడి వైరస్ బాధితుల్ని శతధా బ్రతికించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ ప్రక్రియలో కొంత మంది ప్రాణాలు కోల్పోవటం. అన్నీ తెలిసి యుద్ధంలో సైనికుని వలె తన బాధ్యతని గుర్తు చేసుకుంటూ కనిపించని శత్రువుతో యోధుని మాదిరి పోరాటం చేస్తున్న డాక్టర్లకి, వారి మనో ధయిర్యానికి ఒక్కసారి అందరం మనసుతో అభినందించాలి. 🙏🙏
నా చిన్నతనంలో ధర్మాన్ని రక్షించండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని తెలుసుకున్నాను, బహుశా ఆ భగవంతుడు ఇప్పుడు మానవాళి కోసం కష్టపడుతున్న ప్రతి సైనికుడిని / యోధుడిని (డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, వాలంటీర్ అవొచ్చు ఇంకా ఎవరయినా సహాయకులు ) రక్షించాలని కోరుకుందాం. మానవ మనుగడలో బహుశా ఇంత పెద్ద మహమ్మారి మరి ఎప్పుడు రాలేదేమో! ఇంక ఎప్పుడు రాకూడదనే కోరుకుందాం.

ప్రపంచ సమాజం :
ఈ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంత తడబాటు ప్రదర్శించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ కి మందు లేదని తెలిసి మానవ సమాజాన్ని మరి కొంత ముందు మేలుకొల్పాల్సి ఉందేమో ! ప్రస్తుతానికి స్వీయ నియంత్రణ తప్ప టీకా లేదు కనుక వీలయినన్ని జాగ్రత్తలు తీసుకోవటమే మనం చేయగలిగింది.

  • ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవటం
  • భౌతిక దూరం పాటించటం
  • బయటకి వెళ్ళినప్పుడు ముక్కు మరియు నోటి భాగాలని కవర్ చేసుకోవటం
  • వీలయినంత వరకు సామూహిక ప్రదేశాలలకి వెళ్లక పోవటం
  • రోగ నిరోధక శక్తీ పెంచుకునే ఆహరం, వ్యాయామం చేయటం
  • మనో డైర్యం మరియు నిబ్బరంగా ఉండటం

అయితే ఒక విషయం మనం ఇక్కడ ప్రస్తావించాలి – బ్రిటన్ ప్రధాన మంత్రి గురించి. బోరిస్ జాన్సన్ కరోనా వైరస్ ని ఎదుర్కొనిన విధానం, ఆయన హాస్పిటల్ లో కూడా ఎంతో నిబ్బరంగా తన ప్రజల గురించి మాట్లాడటం. మరియు ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ కేసులు తక్కువగా రిజిస్టర్ అవటం అంటే అక్కడ ఆరోగ్య వ్యవస్థ బాగా పటిష్టంగా ఉండటం మరియు ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం.

వ్యవసాయ రంగం మీద కరోనా ప్రభావం :
కరోనా వైరస్ ప్రభావంతో చాలామంది దినసరి కూలీలు పట్టణాలలో పని చేసే అనేక మంది సొంత ఊరికి/గ్రామానికి బయలుదేరి వెళ్లారు. మొదటి కారణం తమని తాము రక్షించుకోవటం అయితే రెండో కారణం ఉపాధి లేకుండా పట్టణాలలో వుందా లేక పోవటం. ముఖ్యంగా యువత ఎంతో మంది పట్టణాలని విడిచి పల్లెలకు రావటం అభినందనీయం. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగం గురించి శోధించటం. ఈ కరోనా కష్ట కాలంలో ఏదయినా ప్రభావితం కాని రంగం వుంది అంటే అది వ్యవసాయమే. అందుకేనేమో చాలా మంది యువత వ్యవసాయాన్ని గురించి ఆలోచించటం లేదా పని మొదలు పెట్టటం చేసారు. ఇంకో విషయం మనం అభినందించాల్సినది ఏంటంటే దినసరి కూలీ దగ్గర నుంచి సినిమా స్టార్ వరకు ఈ లొక్డౌన్ టైములో చెయ్యగలిగిన పని వ్యవసాయం చెయ్యటం.

ఇలా కరోనా రక రకాల రంగాలలో మంచి చెడుల ప్రభావాన్ని చూపుతుంది. అయితే, తొందరగా వాక్సిన్ వచ్చి మానవాళిని కాపాడాలని మనం అంతా కోరుకుందాం. భగవంతుడు పెట్టిన ఈ పరీక్షలో అందరు సురక్షితంగా బయటకి రావాలని ఆశిస్తున్నా! చివరిగా కరోనా నేర్పిన మంచిని తీసుకుని భవిష్యత్తులో మానవ సంబంధాలు మెరుగు పడగలవని ఆశిస్తూ మానవాళిని మహమ్మారిలా కమ్మేసిన ఈ వైరస్ కర్పూరంలా కరిగిపోవాలని కోరుకుంటున్నా!!.