పర్యావరణం – సమతుల్యత – చెట్ల పెంపకం

మనకు తెలిసిన ఈ భూ భాగంలో 3 వంతులు నీళ్ళు (సముద్రాలు, నదులు etc.) మరియు ఒక వంతు భాగం యోగ్యమయిన భూమి నివాసానికి గాని, వాణిజ్యానికి గాని, వ్యవసాయానికి గాని ఉపయోగ పడుతుందని అంచనా. ఇలాంటి యోగ్యమైన భూమిని కనీస అవసరాలకి, నివాస యోగ్యంగా లేక వ్యవసాయం కోసమో వినియోగిస్తున్నామా? మన దైనందిన కార్యక్రమాలలో రక రకాలయిన విషతుల్యపు పదార్ధాలు (ప్లాస్టిక్స్, రసాయనాలు, పాలిథిన్ వ్యర్ధాలు) భూమిలో కలుపుతూ మన భూమిని మనమే కలుషితం చేస్తున్నామా? మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నామా? లేక సమతుల్యత కోసం ఏమయినా చేస్తున్నామా? ఉదాహరణకి చెట్ల పెంపకం.

పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదం చేస్తాయని శాస్త్ర సాంకేతిక రంగం చెప్తుంది. చెట్లతో ఉపయోగం ఏంటంటే – మనం పీల్చే ఆక్సీజన్, ఎండలో వేడిని తగ్గించటం, భూమిలో నీటి మట్టాన్ని పెంచటం లేక నీటిని నిల్వ చేయటం, ఆహార పదార్ధాలు, మరియు ఇతర మానవ అవసరాలకి (వైద్య ఔషధాల తయారీ, హోమియోపతి మందులు) ఎంతో ఉపయోగం మనకి కనపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు వున్న చెట్లని మనం పెంచుతున్నామా? వున్న చెట్లని కాపాడుకుంటున్నామా ? మరి పర్యావరణ సమతుల్యతలో చెట్ల మాట ఏంటి? ఈ విషయాల మీద ఒక పౌరుడిగా మనం ఏమి చెయ్యగలం?

పూర్వం ఇంటి ముందు భాగంలో, లేక వెనక భాగంలో లేక ఖాళీ స్థలంలో, పొలం గట్ల దగ్గర, మైదాన ప్రాంతాలలో, కొండ చరియల దగ్గర, వాగు వంకలలో మంచి ఉపయోగమయిన చెట్లని (నేరేడు, మామిడి, వేప ఇతర చెట్లు) పెంచేవారు. వాటి ఉపయోగం, ప్రాముఖ్యత గురించి పెద్దలు, గురువులు సమయానుకూలంగా విశదీకరించే వాళ్ళు. కాలానుగుణంగా మారుతున్న పరిస్ధితులలో భూమిని విలువ కట్టి, చెట్ల సంరక్షణ అనేది లేకుండా, ఉన్న చెట్లకి కూడా (ఉదాహరణకి పార్కులు) యాజమాన్య పద్ధతులు ఏమి పాటించకుండా చెట్లని నిర్వీర్యం చెయ్యటం, భూమిని కాంక్రీట్ జంగిల్ గా చేయటం ఎంత వరకు సబబు? భూమి మీద వున్న చెట్లని పరిరక్షించకుండా, క్రొత్తగా చెట్లని పెంచకుండా చెట్లని నరికి వేయవచ్చా? ఉదాహరణ కి ఒక ఉసిరి మొక్కని తీసుకుందాం. నా చిన్నతనంలో వైద్యులు పడిశం లాంటి ఎలెర్జిలకి తక్షణ ఉపశమనంగా ఉసిరి కాయని తినమనేవారు. ఉసిరి ఆకుతో చూర్ణం చేసి నీళ్లతో కషాయం చేసి పట్టించే వాళ్ళు. ఇక ఉసిరి పచ్చడి మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఒక భాగం అయ్యేది. ఇన్ని రకాల ఔషధ గుణాలున్న ఈ చెట్లు ఇప్పుడు మనకి చాల అరుదుగా కనిపిస్తున్నాయి.

మన పాత్ర:

  1. మనం మన పరిసరాలలో ఖాళీ జాగాలని గుర్తించటం
  2. మట్టి పరీక్షలు చేసి అనుగుణమయిన మొక్కలని ఎంపిక చేయటం
  3. కొన్ని మొక్కలని నాటటం, నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వాటిని బ్రతికించటం
  4. గార్డ్ స్ ఏర్పాటు చేయటం
  5. పిల్లలకి విధిగా అవగాహనా కల్పించటం, వీలయితే చదువుకునే పిల్లలే మొక్కలని పెంచేలా ప్రోత్సహించటం
  6. అవగాహన సదస్సు లు మరియు చర్చా కార్యక్రమాలని ఏర్పాటు చేయటం

భావితరాల వారికీ మన వంతుగా మరికొన్ని చెట్లని అందిద్దాం, మన తర్వాతి తరం వారికి వీలయినంత ప్రకృతి సంపదని అందిద్దాం. పర్యావరణాన్ని సమతుల్యం చేయమని అడుగుదాం. ఈ ప్రయత్నంలో అందరం సమిష్టిగా ఒక అడుగు ముందుకు వేద్దాం. మన వంతుగా పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడదాం.

సామాజికంగా వెల కట్ట లేనిది పర్యావరణం, బాధ్యతగా మనం మరికొంత పచ్చదనాన్ని చెట్ల రూపంలో పెంపొందిద్దాం.

ధన్యవాదాలు!
పచ్చని నమస్కారాలు !!
ఇప్పుడు వున్న చెట్ల సాక్షిగా మరిన్ని చెట్లకోసం నడుం బిగిద్దాం !!!